వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ పై పోరులో భాగంగా భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామని వెల్లడించారు. భారత ప్రధనమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చిన ట్రంప్, భారతదేశంలోని తమ స్నేహితులకు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తుందని ప్రకటించడం గర్వంగా ఉందని శుక్రవారం ట్వీట్ చేశారు.
వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికా, భారతదేశం కలిసి పనిచేస్తున్నాయనీ , కరోనా సంక్షోభ సమయంలోమోదీకి తమ మద్దతు వుంటుందని ప్రకటిచారు. ఇరువురం కలిసి అదృశ్య శత్రువు కరోనాను ఓడిస్తామని పేర్కొన్నారు. అలాగే కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకరిస్తున్న భారతీయ-అమెరికన్లను "గొప్ప" శాస్త్రవేత్తలు, పరిశోధకులుగా ట్రంప్ అభివర్ణించారు. ఈ ఏడాది చివరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలకు మాజీ టీకాల హెడ్‌ను గ్లాక్సో స్మిత్‌క్లైన్ నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.



